•  

    2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర వృచ్చికరాశి రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Vrucchika Rasi / Scorpio Sign Free Telugu Rasi Phalalu

     

    • విశాఖ 4 వ పాదము లేదా అనురాధ 1,2,3,4 పాదములు లేదా జ్యేష్ఠ 1,2,3,4 పాదములులో జన్మించినవారు వృచ్చిక రాశి కి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం - 02, వ్యయం - 14, రాజ పూజ్యం - 05, అవమానం - 02
    • పూర్వ పద్దతిలో వృచ్చిక రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "7". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి లభించబోయే విజయవంతమైన అవకాశములను సూచించుచున్నది.

    వృచ్చికరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఎదురగును. సంవత్సర ప్రారంభం నుండి 15 మే 2025 వరకు చక్కటి అనుకూల కాలం ఎదురగును. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేయువారికి మిక్కిలి రూప లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామి లభించును. జీవిత భాగస్వామి సంబందించిన ఆర్ధిక లేదా స్థిర సంపద పరంగా కూడా లాభములు పొందుతారు. ధనార్జన పరంగా మరియు సంతాన విషయ పరంగా కూడా ఈ కాలం అత్యంత అనుకూల కాలం. ఈ కాలంలో గురు గ్రహ అనుకూల బలం వలన మీరు నిర్దేశించుకున్న ఆర్ధిక లక్ష్యాలు పూర్తి చేయగలుగుతారు. 16 మే 2025 నుండి 19 అక్టోబర్ 2025 మధ్య కాలంలో గురు గ్రహం వలన ప్రతికూల ఫలితాలు పొందుతారు. ఆర్ధిక విషయాలలో అదృష్టం తగ్గుతుంది. అనవసరమైన ధన వ్యయం పెరుగుతుంది. ఈ కాలంలో ఆర్ధిక పరంగా ఏ నిర్ణయం తీసుకున్న బాగా ఆలోచన చేసి ముందడుగు వేయుట మంచిది. 20 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు గురువు తిరిగి అతి చక్కటి ఫలితాలను ప్రసాదించును. నూతన వ్యాపార పెట్టుబడులకు, ఉద్యోగ మార్పులకు, జీవితంలో ముఖ్య నిర్ణయాలు తీసుకొనుటకు ఈ కాలం అత్యంత అనుకూల కాలం. 6 డిసెంబర్ 2025 నుండి 18 మార్చ్ 2026 వరకు గురు గ్రహ అనుకూలత తగ్గుతుంది. వ్యక్తిగత జీవితంలో మరియు కెరీర్ రీత్యా కూడా ఈ కాలం ప్రతికూల ఫలితాలు ప్రసాదించును. వ్యక్తిగత జాతకంలో గురు గ్రహం వక్ర గతిలో కలిగి ఉన్న లేదా నీచ క్షేత్రంలో కలిగి ఉన్న వారు ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండవలెను. ఒక పర్యాయం గురు గ్రహ శాంతి జపం జరిపించుకోనుట కూడా మంచిది. 

    వృచ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన కూడా సంవత్సరం అంతా చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. కెరీర్ రీత్యా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేయు వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూల కాలం. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యక్తిగత జాతకంలో శని గ్రహ బలం పూర్తిగా లోపించిన వారు చేయు సంతాన ప్రయత్నాలు మాత్రం విఫలం అగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని దశ లేదు. 

    వృచ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతట ప్రతికూల ఫలితాలు ఎదురగును. మాత్రు వర్గీయులతో విభేదాలు ఎదుర్కొందురు. సంతాన ప్రయత్నాలలో ముఖ్యంగా సర్ప దోషం కలిగిన వారికి అనేక అడ్డంకులు ఎదురగును. విద్యార్దులకు కూడా శ్రమ అధికం అగును. వ్యసనాల పట్ల ఆకర్షింపబడటం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా 16 జూలై 2025 నుండి 2 సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో వృశ్చిక రాశి  వారు అన్ని విషయాలలో మిక్కిలి జాగ్రత్తగా ఉండడం మంచిది. 

    వృచ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఎదురగును. ఆర్ధిక సంబంధ విషయాలలో అభివృద్ధికి అవసరమగు అవకాశములు లభించునట్లు చేయును. ముఖ్యంగా 18 మే 2025 వరకు భూ లేదా గృహ క్రయ విక్రయాలకు, వ్యాపార పరమైన పెట్టుబడులకు అనుకూల కాలం. 19 మే 2025 నుండి సామాన్య ఫలితాలు ఎదురగును. 

    ఏప్రిల్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కార్య నిర్వహణలో అందరికన్నా ముందు ఉండి ప్రతిభతో ఉన్నత అధికారులను ఆకర్షించగలరు. వాయిదా పడుతున్న పనులు పూర్తీ అగును. జీవిత భాగస్వామి వలన ధన ప్రాప్తి లేదా స్థిరాస్తి లాభం ఏర్పడును. నూతన వాహన యోగం ఉన్నది. తలపెట్టిన పనులు ఆశించిన విధంగా పూర్తీ అగును. అన్ని రంగాల వారికి ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉండును. పట్టుదల వదిలి ఆలోచించడం మంచిది. వ్యాపార రంగం వారు ఆశించిన ధనాదాయం పొందుదురు. విద్యార్ధులకు ఉన్నత విద్యా అవకాశములు లభించును.

    మే 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో నూతన ఆలోచనలు ఎలాంటి ప్రతి ఘటనలు లేకుండా అమలు చేయగలరు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా నడుచును. అవివాహితుల వివాహ ప్రయత్నాలు లాభించును. బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కుదురును. ఉద్యోగులకు దూర ప్రాంత ధనాదాయం ప్రాప్తించును. స్పెక్యులేషన్ లాభించును. పని చేయు కార్యాలయంలో కపట స్వభావులు ఎదురగుదురు. కుటుంబ సమస్యల తీర్పులలో నిర్ణయాత్మకంగా ప్రధాన పాత్ర వహిస్తారు. నూతన ఒప్పందాలు లభిస్తాయి. ఈ మాసంలో స్థాన చలన అవకాశములు లేవు. మిత్ర వర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. ఈ మాసంలో 17, 18 తేదీలు మినహా మిగిలిన రోజులు అనుకూలంగానే ఉండును.

    జూన్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రారంభ మూడు వారాలు గత మాసంలో వలె శుభ ఫలితాలు పొందుదురు. ఆశించిన ధనాదాయం చేతికి వచ్చును. కోర్టు వివాదాలు, తగవులు పరిష్కారం అగును. మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరును. అన్ని విధములా కుటుంబ సహకారం లభించును. ఆలోచనా విధానం ఉన్నతంగా ఉంటుంది. నూతన భాద్యతలను తీసుకొందురు. ఆర్ధిక లక్ష్యాలను చివరి నిమిషంలో పూర్తీ చేయగలుగుతారు. చివరి వారంలో ఖర్చులు విపరీతమగును. చేతిలో ధనం నిలుచుట కష్టం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికం. ప్రైవేటు ఉద్యోగులకు పనులు అస్తవ్యస్తం అవుతాయి. 23 వ తేదీ తదుపరి వేడుకలకు , విందు వినోదాలకు దూరంగా ఉండుట మంచిది. మాసాంతంలో పెద్దలతో వాగ్వివాదాలకు అవకాశం ఉన్నది.

    జూలై 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం అంతగా అనుకూలమైనది కాదు. అనవసర విమర్శలు, అపవాదులు ఎదుర్కొందురు. కష్టానికి తగిన గుర్తింపు లభించదు. గృహంలో అనారోగ్య మూలక ఆందోళన ఉండును. సంతాన వ్యవహార తీరు అసహనం కలిగిస్తుంది. స్వయం నియంత్రణ అవసరం. మన మాటే నెగ్గాలి అనే పట్టుదల పనికిరాదు. కఠిన నిర్ణయాల వలన నష్టం పొందు సూచనలు అధికంగా కలవు. మొత్తం మీద ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జ్యేష్టా నక్షత్ర జాతకులకు వైవాహిక జీవన సంబంధ మానసిక అశాంతి ఏర్పడును. ఖర్మను మించి ఏమి పొందలేరని గ్రహించాలి. ఈ మాసంలో 6, 9, 10, 15, 17, 26 తేదీలు అనుకూలమైనవి కావు.

    ఆగష్టు 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఆర్ధిక పరిస్థితులలో మెరుగుదల కనిపిస్తుంది. ఋణ విముక్తులు అగుదురు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశములు తిరిగి లభించును. సులభంగా పనులను పూర్తీ చేయగలరు. వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉండును. వ్యక్తిగత జీవనంలో అపసృతులకు అవకాశం ఉన్నది. స్త్రీ లకు గర్భ సంబంధ వ్యాధుల సమస్యలకు సూచనలు కలవు. విశాఖ నక్షత్ర జాతకులకు ఆఖస్మిక వాహన మరమత్తుల సంబంధ వ్యయం. కుటుంబ విషయాలలో భాత్రు వర్గంతో మైత్రి తగ్గును. నూతన వ్యాపకాలు అలవడును. నూతన ఆలోచనలు స్పురిస్తాయి. స్నేహ వర్గాలలో ఒకరికి సంబందించిన దుర్వార్త తెలుసుకుంటారు. ఈ మాసంలో ఉత్తర దిశలో చేసే ప్రయాణాలు మంచి లాభపురితంగా ఉంటాయి.

    సెప్టెంబర్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో జీవితంలో నూతన ఉత్సాహం లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. విరామం లేకుండా వ్యవహారాలు పూర్తిచెయుదురు. శ్రమకు తగిన లబ్ది లభించును. వ్యాపార వ్యవహారాలలో ఆశించిన పెట్టుబడులు లభించును. నూతన భాగస్వాములు లభిస్తారు. భాగస్వాముల సలహాలు కలసి వచ్చును. పితృ వర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందును. పుణ్య క్షేత్ర సందర్శన చేయుదురు. ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకర వార్తలు వింటారు. ఈ మాసం ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల కాలం. మొత్తం మీద వృశ్చిక రాశి వారికీ ఈ మాసం సంతోషకరంగానే ఉంటుంది. ఈ మాసంలో 4, 5, 8, 10 తేదీలలో చేపట్టే కార్యములు విజయవంతం అగును.

    అక్టోబర్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చివరినిమిషంలో చేజారిపోవును. వ్యయం కూడా అదుపు తప్పుతుంది. ఆత్మీయుల ప్రవర్తన మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలుగచేస్తుంది. గౌరవానికి భంగం ఏర్పడుతుంది. దైనందిన విషయాల పట్ల ఆసక్తి పోతుంది. సొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమగును. చేపట్టిన కార్యక్రమాలలో అడ్డంకులు, స్తబ్ధత నిరాశ కలుగచేస్తాయి. మొత్తం మీద ఈ మాసం అంత ఆశించిన ఫలితాలను ఇవ్వదు. జీవన విధానంలో నూతన మార్పులకు ప్రయత్నించకండి. ఈ మాసంలో ఆర్ధికంగా భారి పెట్టుబడులు పెట్టకుండా ఉండుట మంచిది.

    నవంబర్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం తీవ్ర ప్రతికూల ఫలితాలు కలుగచేయు సూచనలు అధికంగా ఉన్నవి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు సమస్యలు కలిగించును. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. అన్ని విధాల ప్రతి బంధకాలు ఎదురగును. వృధా ప్రయాణాల వలన ధనము, సమయము కోల్పోవుదురు. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యక్తీ గత జీవన సుఖ సంతోషాలు తగ్గును. జీవన విధానంలో అనిచ్చితి ఏర్పడుతుంది. తలచిన పనులకు దైవ బలం, ఆశీస్సులు అవసరం. విలాస వస్తువులకు సంబంధించిన వ్యయం చేయకండి. స్థిరాస్తి లావాదేవీలలో మధ్యవర్తులను నమ్మకండి. స్త్రీలకు గౌరవ హాని కలిగించు సంఘటనలు కలవు.

    డిసెంబర్ 2025 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల సహాయ సహకారాలు ఆశించకుండా ఉండుట మంచిది. ఖర్చులను తగ్గించుకోవాలి. ఉద్యోగ వ్యాపార జీవనల్లో ఆఖస్మిక నష్టములు ఎదురగుటకు సూచనలు ఉన్నవి. యువకులు తప్పుడు మార్గములలో ప్రయాణించే అవకాశములు అధికం. పనులు ముందుకు సాగవు. అనురాధ నక్షత్ర జాతకులు కళత్ర జీవనంలో సమస్యలు ఎదుర్కొంటారు. బంధు - మిత్ర విరోధాలు బాధించును. ఆరోగ్య పరంగా చ్చాతి సంబంధ లేదా శ్వాస సంబంధ సమస్యలు బాధించును. మొత్తం మీద ఈ మాసం అనుకూలమైనది కాదు. అన్ని రంగాల వారికి అంతగా కలసి రాదు.

    జనవరి 2026 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడును. 14 వ తేదీ వరకూ కొంత నిరాశాజనకంగా ఉండును. ప్రమాదాల నుండి తప్పించుకోనుదురు. కుటుంబ విషయాలకై ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది. మానసిక సంతృప్తి ఉండదు. ఉత్తరాయణ పుణ్య కాల ప్రారంభం నుండి కొంత ఒత్తిడి తగ్గును. సంతాన మూలక లాభము ఏర్పడును. బంధుత్వాలు బలపడును. సహాయం లభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చురుకుగా ముందుకు కదులుతాయి. దైవ సంబంధ కార్యములందు పాల్గొంటారు. కుటుంబ సమస్యలకు కారణం గుర్తించగలరు. యువకులకు వెన్నుపూస సంబంధ అనారోగ్య సూచన. ఈ మాసంలో 3, 7, 10, 12 తేదీలు మానసికంగా అధిక ఆందోళన కలిగించును.

    ఫెబ్రవరి 2026 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ఆకస్మిక ప్రమాదాలు ఏర్పడు సూచన. జాగ్రత్తగా ఉండవలెను. నమ్మిన వారి వలన ఊహించని విధంగా ఒక నష్టం లేదా నింద ఎదురగును. కోర్టు వ్యవహారాలు లేదా ప్రభుత్వ జరిమానాలు చికాకు కలిగించును. ధనాదాయం సామాన్యం కాని ధన వ్యయ సూచన బలంగా ఉన్నందున ఆర్భాటములకు దూరంగా ఉండవలెను. . స్థాన చలన ప్రయత్నాలు విఫలమగును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సామాన్యంగా కొనసాగును. శుభకార్యములు వాయిదా పడును. చివరి వారంలో కొద్దిపాటి కార్యానుకులత ఏర్పడును. ఈ మాసంలో ఎదుటివారిని ఏ సందర్భంగానూ విమర్శించవద్దు. తగాదాలలో తగ్గి ఉండడం మంచిది.

    మార్చ్ 2026 వృశ్చికరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో కొన్ని దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ విషయాలలో ప్రశాంతత ఏర్పడుతుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టు వ్యవహారలందు వేగం పెరుగుతుంది. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం వలన లాభం ఏర్పడుతుంది. గృహమార్పిడి ప్రయత్నాలు ఫలించును. ఈ మాసంలో 11 నుండి 15 వ తేదీ మధ్య కాలంలో విలువైన పత్రాలు, ఆభరణాల పట్ల జాగ్రత్త అవసరం. తృతియ వారంలో నూతన అవకాశములు లభించును. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు తగ్గును. జీవిత భాగస్వామి సలహాలు పనిచేస్తాయి. మాసాంతానికి తలపెట్టిన పనులు సజావుగా సాగుతాయి.