• 2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సర మీనరాశి రాశీ ఫలాలు

    Sree Viswavasu Nama Samvatsara Meena Rasi / Pisces Sign Free Telugu Rasi Phalalu

     

    • పూర్వాభాద్ర 4వ పాదము లేదా ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు లేదా రేవతి 1,2,3,4 పాదములలో జన్మించిన వారు మీన రాశికి చెందును.
    • శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం - 05, వ్యయం - 05, రాజ పూజ్యం - 03, అవమానం - 01
    • పూర్వ పద్దతి లో మీన రాశి వారికి వచ్చిన శేష సంఖ్య "1". ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీన రాశి వారికి లాభకర జీవనం ఏర్పడుటను సూచించుచున్నది.

    మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో అనగా 30 మార్చి 2025 నుండి 18 మార్చి 2026 వరకు ఉన్న తెలుగు కాల మాన సంవత్సరంలో గురు గ్రహం వలన 15 మే 2025 వరకు ప్రతికూల ఫలితాలు ఎదురగును. నిత్య జీవితంలో తీవ్ర చికాకులు ఎదుర్కొందురు. 16 మే 2025 నుండి 18 మార్చ్2026 వరకు గురు గ్రహం వలన అతి చక్కటి అనుకూల ఫలితాలు ఎదురగును. గృహసంబంధ లేదా భూ సంబంధ లాభములు పొందుతారు. మాత్రు వర్గీయుల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వ్యాపార వర్గముల వారికి ఈ కాలం మంచి లాభములు కలుగచేయును. పండిత వర్గం వారి ఆదరణ లభిస్తుంది. మేధా సంపత్తి పెరుగుతుంది. అన్ని విధముల ఈ కాలం సంతృప్తి కరంగా ఉంటుంది.

    మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శని గ్రహం వలన సంవత్సరం అంతా కలసి రాదు. ఉద్యోగ జీవులకు శ్రమ అధికం అవుతుంది. ఆర్ధిక విషయాలలో లోభత్వం ప్రదర్శిస్తారు. ఆలోచన విధానం సక్రమంగా ఉండదు. చెడు ఆలోచనలు అధికం అగును. మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏలినాటి శని దశ ఉన్నది.

    మీనరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాహు గ్రహం వలన సంవత్సరం అంతా కలసి రాదు. దుర్జనుల సహవాసం ఏర్పడుతుంది. వారి వలన కష్టార్జితాన్ని దుర్వ్యయం చేయవలసి వస్తుంది. తలపెట్టిన పనులు అనేక వ్యవహార చికాకులను ఎదుర్కొంటాయి. మనసుకు కష్టం కలుగచేయు సంఘటనలు ఎదుర్కొంటారు.మిత్ర వర్గంతో జాగ్రత్తగా ఉండవలెను.

    మీనరాశి వార్కి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కేతు గ్రహం వలన కూడా సంవత్సరం అంతా ప్రతికూల ఫలితాలు ఎదురగును. ముఖ్యంగా కేతువు వలన వైవాహిక జీవన ఇబ్బందులు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు, కాలం వృధా అవ్వడం వంటి సమస్యలు ఎదురగును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వ్యక్తిగత జాతకంలో కాల సర్ప దోషం కలిగి ఉన్న  మీనరాశి జాతకులు నిత్యం రాహు - కేతు గ్రహ స్తోత్ర పారాయణ చేయడం మంచిది.

    ఏప్రిల్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో పితృ వర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వినడానికి సూచనలు ఉన్నాయి. ధన ఆదాయం అవసరాలకు తగిన విధంగా ఉండును. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తొలగును. ద్వితియ మరియు తృతీయ వారాలలో ఉత్తమ ఆశించిన ఫలితాలు ఏర్పడును. కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగును. సమాజంలో నూతన హోదా ను ఏర్పాటుచేయుదురు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాలలో తోడ్పాటు లభించును. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా కొనసాగును. చివరి వారంలో చక్కటి మానసిక ప్రశాంతత లభించును. ఈ మాసంలో 24, 25, 26 తేదీలలో యుక్త వయస్కులైన పుత్ర సంతానానికి ఆరోగ్య సమస్యలు.

    మే 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో వివాహ జీవనంలో ఎదుర్కొంటున్న గత కాలపు సమస్యలు తగ్గును. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడును. కోర్టు తగాదలలో అనుకూలత ఏర్పడును. గృహంలో బంధు వర్గం కలయికల వలన సంబంధాలు మెరుగుపడును. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్ధికంగా వ్యయం ఎక్కువ అగుటకు సూచనలు ఉన్నాయి. 22 వ తేదీ తదుపరి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సంతోషకర వార్తలు వింటారు. వ్యాపార వర్గం వారికి ఆదాయంలో పెరుగుదల ఏర్పడును. సంతాన ప్రయత్నాలు సఫలమగుటకు దైవ ఆశీస్సులు అవసరం.

    జూన్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసం మొదటి వారంలో నూతన ఆదాయ మార్గములు లభించును. వ్యాపారములు మంచి అభివృద్ధికర మార్గంలో కొనసాగును. భాత్రు వర్గంతో ఆధిపత్య సంబంధ విరోధములు ఏర్పడును. ద్వితీయ వారం సామాన్య ఫలితాలను కలుగచేయును. తృతీయ వారంలో మిత్రుల వలన ఒక ఆర్ధిక నష్టం ఎదుర్కొందురు. కుటుంబ పరంగా సిద్ధంగా లేని ఖర్చులు ఎదుర్కొందురు. వివాహ ప్రయత్నములలో ఆశాభంగం ఏర్పడును. ఈ మాసంలో బ్యాంకు లేదా బంగారు ఆధారిత ఋణములు తీసుకొనుట, ఇతర ఆర్ధిక పరమైన విషయాలలో పాల్గొనుట అంత మంచిది కాదు. కుటుంబ పెద్దల సలహా పాటించండి.

    జూలై 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రధమ అర్ధభాగం అంత అనుకూలంగా ఉండదు. స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందులు కలుగచేయును. ధనాదాయం తగ్గును. అవసరాలకు రావలసిన ధనం అందుట కష్టం. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ద్వితీయ అర్ధ భాగం నుండి వృత్తి వ్యాపారములలో అనుకూలత ప్రారంభమగును. నూతన కాంట్రాక్టులు పొందుతారు. సంతాన ప్రయత్నములు వంశ పెద్దల ఆశీస్శులతో విజయవంతం అవుతాయి. ఆర్ధిక విషయాలలో కూడా అనుకూలత పొందుతారు. చివరి వారం స్థానచలన ప్రయత్నాలకు మంచి కాలం. ఈ మాసంలో దంత సంబంధ సమస్యల వలన ఇబ్బందులు పడుదురు.

    ఆగష్టు 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ప్రారంభంలో చికాకులు ఉన్నప్పటికీ చివరకు జయం చేకురును. వ్యక్తిగత జీవనంలో సంతోషకర సంఘటనలు ఏర్పడును. శత్రువులపై విజయం పొందుతారు. కొద్దిపాటి గర్వం ప్రదర్శిస్తారు. తలపెట్టిన పనులలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. ద్వితియ తృతీయ వారములలో అనేక ఆటంకములతో విదేశీ ఉద్యోగ ప్రయత్నములు సఫలం అగును. కుటుంబ వ్యవహారములలో మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. మీ మాటతీరు సమస్యలను ఏర్పరచును. చివరి వారంలో శ్రమ అధికం మరియు ఉద్యోగ జీవనంలో అనిశ్చిత వాతావరణం. ఈ మాసంలో 10, 11, 18, 25, 26 తేదీలలో చేయు ప్రయాణాలు కలసిరావు. నూతన కార్యాకలాపాలు ప్రారంభించకండి.

    సెప్టెంబర్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో బహు అవరోధములు ఎదుర్కొందురు. మానసిక వ్యధ కూడా అధికం అగును. భవిష్యత్ ఆందోళన అధికం అగును. అకాల భోజనములు చికాకులు కలుగ చేయును. పిల్లలకు శిరోబాధ లేదా కర్ణ సంబంధ సమస్యలు. వివాహ ప్రయత్నాలు కష్టం మీద జయం పొందును. ఉద్యోగ జీవనంలో ఉహించని ఆటంకములు ఏర్పడును. దురుకోపాన్ని తగ్గించుకోవాలి. సోదరి వర్గ సంబంధ పనులకోసం విరామం లేకుండా శ్రమించవలసి వచ్చును. నూతన విద్యలను అభ్యసించు అవకాశములు లభిస్తాయి. ఈ మాసంలో ఆవేశం తగ్గించుకోని ప్రవర్తించుట మంచిది. వృత్తి వ్యపారములందు మొత్తం మాసం మీద ధనాదాయం కొంత తగ్గును.

    అక్టోబర్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో వృద్ధులకు శరీర ఆరోగ్యం సహకరించును. కుటుంబ జీవనంలో శుభకార్యములు నిర్వహించుట, ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో చేరికలు ఏర్పడుట జరుగును. ఉద్యోగ జీవనంలో కార్యానుకులాత లభించును. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురగును. జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగును. చివరి వారంలో వృత్తి వ్యాపారములు సులువుగా ఆశించిన విధంగా కొనసాగును. మాసాంతంలో సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగును. నిల్వధనం ఏర్పడును. చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభించును.

    నవంబర్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో చాలా అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఏర్పడును. సజ్జన సాంగత్యం లభించును. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభములు ఏర్పడును. బ్యాంకు ఋణ బాధలు తొలగుతాయి. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందును. భవిష్యత్ గురించిన అనుకూల బాటలు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. 17 వ తేదీ తదుపరి మాసాంతం వరకూ చక్కటి లాభకరమైన పరిస్థితులు ఏర్పడును. దూర దేశ ప్రయాణాలు చేస్తారు.

    డిసెంబర్ 2025 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. జీవిత భాగస్వామి పనులకై సమయం వెచ్చిస్తారు. మీ సహకారం వలన వారికి కార్యజయం ఏర్పడుతుంది. వ్యక్తిగత జీవనంలో సౌక్యం ఏర్పడును. ఆర్ధిక విషయాలలో మిత్ర వర్గంపై ఆధారపడకుండా ఉండుట మంచిది. కుటుంబంలో ఎదుర్కొంటున్న వృధా వ్యయం తగ్గించగలుగుతారు. ద్వితియ వారంలో వాహనముల వలన ఇబ్బందులు కలుగును. పరోపకారం వలన ఆత్మతృప్తి లభించును. విదేశీ లేదా ఉద్యోగ స్థానచలన ప్రయత్నములలో కష్టం మీద విజయం చేకురును. 7,8,9,10 తేదీలలో నూతన ప్రయత్నాలు చేయుట మంచిది.

    జనవరి 2026 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో 2వ తేదీ నుండి 7వ తేదీ వరకూ కాలం అనుకూలంగా ఉండదు. గృహంలో చొరభయం లేదా విలువైన వస్తువులు చెడిపోవును. మానసికంగా ఆందోళన చెందుతారు. ద్వితియ వారంలో కార్యభారం పెరుగును. తీవ్ర కాలయాపనతో దూరప్రాంత ప్రయాణములు ఏర్పడతాయి. మిక్కిలి ప్రయాస అనంతరం కార్యములలో విజయం సాధిస్తారు. వృత్తి - వ్యాపారాదులు సామాన్యంగా కొనసాగును. ఆదాయంలో పెరుగుదల కొరకు నూతన మార్గములకై చేయు ఆలోచనలు ఫలిస్తాయి. పుత్రికా సంతానం వలన కొద్దిపాటి చికాకులు. ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగును. మాసాంతంలో అధికారుల, పెద్దల సహాయ సహకారములు లభించును.

    ఫెబ్రవరి 2026 మీనరాశి రాశిఫలాలు: 

    ఈ మాసంలో అంతగా అనుకూల ఫలితాలు లేవు. వ్యక్తిగత ఆరోగ్యంలో జ్వరతత్వం వలన బాధలు ఏర్పడును. కష్టంతో పనులు పుర్తిచేయగలుగుతారు. గత కాలంలో దాచుకున్న ధనము కొంత వ్యయం అగును. 16వ తేదీ నుండి నుండి ఆందోళనకర పరిస్థితలు అధికం అగును. ప్రభుత్వ అధికారుల వలన తీవ్ర ఆటంకములు. చివరి వారానికి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండగలదు. ప్రతీ వ్యవహారంలో బాగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యా సంబంధ ప్రయత్నాలలో ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడును. ఈ మాసంలో 7,9,11,25 తేదీలు అనుకూలమైనవి కావు.

    మార్చ్ 2026 మీనరాశి రాశిఫలాలు:

    ఈ మాసంలో కూడా ప్రతికూల పరిస్థితులు కొనసాగును. ధనాదాయం ఆశించినంతగా ఉండదు. భూ సంబంధ క్రయవిక్రయాల వలన నష్టం ఏర్పడును. వ్యాపార వ్రుత్తిజీవనంలోని వారికి ఆదాయంలో తగ్గుదల ఎదురగును. ఉద్యోగ జీవనంలోని వారికి నూతన భాద్యతల వలన విశ్రాంతి వుండదు. పూర్తిగా శ్రమించినా కూడా విమర్శలు ఎదుర్కొందురు.